మహా శివరాత్రి పూజ చేయు విధానం :-
గరుడ పురాణంలో శివరాత్రి ఆచరణ విధానం గురించి ఇలా పేర్కొనబడింది – త్రయోదశి రోజునే శివుని సన్మానించి, వ్రతాలకు సంబంధించిన కొన్ని నియమాలను గమనించాలి. అంటే, మనసులో దృఢంగా నిర్ణయించుకుని కొన్ని నియమాలను పాటించాలి.
వ్రత సంకల్పం:
“హే మహాదేవా! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్థ్యాన్ని అనుసరించి దానం, తపస్సు, హోమం నిర్వహిస్తాను. ఆ రోజు నేను నిరాహారంగా ఉంటాను మరియు రెండవ రోజున మాత్రమే భోజనం చేస్తాను. ఓ శివా! నాకు ఆనందం, మోక్షాన్ని అనుగ్రహించు!”
వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు విశిష్టమైనవి. వాటిలో ఋగ్వేదం అత్యంత గొప్పది. రుద్రం ఇందులో అత్యున్నతమైనది. పంచాక్షరీ మంత్రంలో “శివ” అనే రెండక్షరాలు అపారమైన శక్తిని కలిగి ఉన్నాయి. “శివ” అంటే మంగళకరమైనదని అర్థం, అట్టి పరమ మంగళకరమైన తత్త్వమే శివస్వరూపం. ఆ పరమశివుని అనుగ్రహాన్ని పొందేందుకు మనం జరుపుకునే విశేషమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో పేర్కొన్నట్లుగా, ఈ మహాశివరాత్రి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష చతుర్ధశి నాడు ఘనంగా జరుపుకుంటాం.
వ్రతం పూర్తయ్యాక, భక్తులు గురువు వద్దకు వెళ్లాలి. అనంతరం, శివలింగానికి పంచామృతంతో పాటు పంచగవ్యాలతో (ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, గోమయం, గోమూత్రం) అభిషేకం చేయించాలి. అభిషేక సమయంలో “ఓం నమః శివాయ” జపిస్తూ శివుని ధ్యానం చేయాలి.
శివపూజను చందన లేపనంతో ప్రారంభించి, అన్ని ఉపచారాలతో సమర్పించాలి. అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం సమర్పించి హోమం నిర్వహించాలి. హోమం పూర్తయిన తరువాత పూర్ణాహుతి సమర్పించి, శివకథలు వినడం శ్రేష్ఠమైనదిగా భావించబడుతుంది.
వ్రతంలో మరో కీలక భాగం రథరాత్రి మూడవ, నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించడం. సూర్యోదయం వరకు మౌనంగా ఉండదలచిన భక్తులు “ఓం నమః శివాయ” అని నిరంతరం శివుని స్మరించాలి.
శరణాగతి ప్రార్థన:
“హే పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను ఈ పూజను నిర్విఘ్నంగా పూర్తి చేసాను. ఓ లోకేశ్వరా, శివ-భవా! నా పొరపాట్లను క్షమించండి. ఈ రోజు నేను సంపాదించిన పుణ్యమంతా మీ పాదార్పితమే. హే కృపానిధీ! మా మీద దయచూపి ప్రసన్నులవండి. మీ దర్శనమాత్రణమే మాకు పవిత్రతను అందించింది!”
అనంతరం, శివభక్తులకు భోజనం పెట్టి, వారికి వస్త్రాలు, ఛత్రాలు అందించాలి. నిజానికి, లింగోద్భవమైన అర్ధరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతి రోజూ శివరాత్రియే. ప్రతిక్షణం శివస్మరణమే శ్రేష్ఠమైన సాధన. అయితే, కృష్ణపక్ష చతుర్దశి శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో, ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రిగా పరిగణిస్తారు.
ఇందులోను మాఘ బహుళ చతుర్దశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే, ఆ రోజును మహాశివరాత్రిగా ఘనంగా జరుపుకుంటారు.
ఆ రోజు ఉదయం స్నానాది కర్మలు పూర్తి చేసుకున్న తర్వాత, సాధ్యమైనంతవరకు శివాలయ దర్శనం చేయాలి. అవకాశం లేకపోతే, ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రియమైన పుష్పాలు, బిల్వదళాలతో అర్చించాలి. శక్తికొలది పాలు, గంగాజలం, పంచామృతంతో లింగాభిషేకం చేయాలి.
ఉపవాసం, జాగరణ, శివస్మరణలతో ఆ రోజంతా గడిపి, మరుసటి రోజు ఉత్తమ విప్రులకు, శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానం బోధించబడింది.
శివరాత్రి – లింగోద్భవకాలం
శివరాత్రిని లింగోద్భవకాలం అని కూడా పిలుస్తారు. ఈ పవిత్ర రాత్రి, అర్ధరాత్రి సమయంలో శివుడు జ్యోతిర్మయమైన మహాలింగంగా ఆవిర్భవించి జగత్తునంతా ప్రకాశింపజేశాడు. ఆ పరమ దివ్యక్షణంలో నిద్రపోవడం అప్రయోజనకరం, అందుకే శివరాత్రి జాగరణకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది.
ఈ రోజున అభిషేకాలు చేసి, శివుని పూజించి, ఉపవాసం పాటించి, శివనామస్మరణతో గడపడం ద్వారా మన శరీరాన్నీ, మనసునీ శివుని చరణాల్లో అర్పించడమే ప్రధాన ఉద్దేశం.
శివతత్త్వం – జ్ఞాన స్వరూపం:
శివుడు స్వయంగా జ్ఞానమే. జన్మమరణ చక్రాలను అధిగమించి, నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఈ జ్ఞానానికే ఉంది.
శివరాత్రి మహత్యం:
శాస్త్రాల ప్రకారం, పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు శివరాత్రి రోజున బిల్వదళాల మూలంలో ఉంటాయి. కనీసం ఒక్క బిల్వదళమైనా శివునికి అర్పిస్తే ముక్తిని పొందగలమని శాస్త్ర వచనం చెబుతోంది. పెద్దలు కనీసం జన్మలో ఒక్క శివరాత్రి అయినా పాటించాలని ఉపదేశిస్తారు.
శివార్చన & దానప్రాముఖ్యత:
భూమిపై శివుడు సూక్ష్మజ్యోతిరూపంగా ఉండి, పార్దివలింగంగా ఆరాధించబడతాడు. శివరాత్రి రోజున, ఒక తోటకూర కట్టైనా శివునికి సమర్పించడం ముక్తిని ప్రసాదిస్తుంది.
శక్తివంతులు బంగారం, వెండి కుండలలో ఆవునేతితో దీపం వెలిగించి, పండితునికి సమర్పిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుందని పెద్దల మాట.
శివరాత్రి రోజున ఉపవాసం చేసి, త్రికరణ శుద్ధితో శివుని ఆరాధిస్తే, ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలితం లభిస్తుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి వెల్లడించినట్లు పెద్దలు చెబుతున్నారు.